వాల్మీకి రామాయణం 152 వ భాగం, అరణ్యకాండ

అప్పుడా జటాయువు ఒంట్లోనుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపుతప్పి ఒక చెట్టు దెగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సేతమ్మని చూసి రావణుడు ” జటాయువు కోసం ఏడుస్తావే, రా ” అని సీతమ్మ వెనక రావణుడు పరుగుతీసాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని, చెట్లని కౌగిలించుకుంది.

అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి ” చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా ” అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి ” ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా ” అన్నారు.

రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు.