వాల్మీకి రామాయణం 155 వ భాగం, అరణ్యకాండ

అశ్రు పూర్ణ ముఖీం దీనాం శోక భార అవపీడితాం |
వాయు వేగైః ఇవ ఆక్రాంతాం మజ్జంతీం నావం అర్ణవే ||
ఆ అంతఃపురంలో కళ్ళనిండా ఏడుస్తూ, చెంపల మీద ఆ కన్నీళ్ళు కారుతూ, అత్యంత దీనంగా, శోకం చేత పీడింపబడి, పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో, అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడి పిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో, అలా సీతమ్మ తల దించుకుని ఏడుస్తూ ఉంది.


అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి, తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చెయ్యబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైనవాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక ” ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్కనుంచి మినహాయిస్తే, 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు, వీరందరూ నన్ను కోరి వచ్చినవారే. ఓ ప్రియురాల! నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా, నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు, నాయందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని, నాగులు కాని, పక్షులు కాని కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు, తీసుకెళ్ళే వాడు ఎవరు?

రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన పదాతినా |
కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్ప తేజసా ||
ఇంకా రాముడు, రాముడు అంటావేంటి. ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు, రాముడు కేవలం మనిషి, అటువంటి రాముడితో నీకేమి పని. నీకు తగినవాడిని నేను, అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో, మళ్ళి పట్టాభిషేకం చేసుకుందాము. ఆ పట్టాభిషేకము చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి, నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు, ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు, రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నాదెగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకొని చక్కగా అలంకరించుకో, మనమిద్దరమూ పుష్పక విమానంలో విహారం చేద్దాము ” అన్నాడు.