వాల్మీకి రామాయణం 160 వ భాగం, అరణ్యకాండ

మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు ” అన్నయ్యా!  ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, ‘మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా’ అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము ” అన్నాడు.


అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనుక పరుగు తీసారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు ” మారీచుడు వచ్చేముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను. ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు. చూశావ ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి, అంటె ఎవరో సీతని తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతుంది, ఎవరిదో గొప్ప ధనుస్సు విరిగి కింద పడిపోయి ఉంది, ఎవరో ఒక సారధి కూడా కింద పడిపోయి ఉన్నాడు, పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు.