వాల్మీకి రామాయణం 163 వ భాగం, అరణ్యకాండ

సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||
అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి ” తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం రా. కాని నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము ” అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి, ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు ‘ రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను, ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను’ అని మనసులో అనుకొని, కొదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.

అప్పుడు జటాయువు ” రామ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు, అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు ” అన్నాడు.

జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.

రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |
ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||
అప్పుడు రాముడు ” నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది.  అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! ” అన్నాడు. అలాగే ” జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు ” అన్నాడు.