వాల్మీకి రామాయణం 164 వ భాగం, అరణ్యకాండ

అప్పుడా జటాయువు ” ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలొ ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య….” అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి ” ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు…..” అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.

అప్పుడు రాముడు ” చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.

అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము ” అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).


ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి ” నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు” అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.

జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు.