వాల్మీకి రామాయణం 165 వ భాగం, అరణ్యకాండ

తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దెగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని ” నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరమూ ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము ” అనింది.

లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.

తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు ” అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ వంజులకం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది, కాని పరమ దారుణమైన యుద్ధం జెరుగుతుంది……..” అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దెగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది ”  నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను ” అని అంటూ వాళ్ళని దెగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో ” మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము ” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు ” మీరు ఇద్దరు ఎవరు? ” అని అడిగాడు.

” ఈయనని రాముడు అంటారు, దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేంటి? నీలాంటి రక్షాసుడిని మేము ఎప్పుడూ చూడలేదు ” అని లక్ష్మణుడు అన్నాడు.