వాల్మీకి రామాయణం 166 వ భాగం, అరణ్యకాండ

అప్పుడా కబంధుడు ” నేను మీకు నా కథ చెబుతాను, కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేంటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతె ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి ” అన్నాడు. ” సరే, నువ్వు కోరినట్టే నిన్ను కల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా ” అని రామలక్ష్మణులు అడిగారు.

అప్పుడా కబంధుడు ” మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు, కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి ” అన్నాడు.

” కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు” అని రామలక్ష్మణులు అడిగారు.  

అప్పుడు కబంధుడు ” పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిని ఆలోచన వచ్చింది, అదేంటంటే, ‘ నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ‘ అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ‘ ఇలా ఈ రూపంతో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగె చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు’ అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ‘ మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కాని నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది’ అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ‘ నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పారు.

అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ‘ ఏమి కావాలి ‘ అని అడిగారు. అప్పుడు నేను ‘ నాకు దీర్ఘాయువు కావాలి ‘ అని అడిగాను. బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘ ఆయుర్దాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది, అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది, నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరంతో కిందపడ్డాను.

అప్పుడు నేను ఇంద్రుడితో ‘ నువ్వు నన్ను కొట్టేశావు, బాగానేఉంది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కాదా, మరి నేను ఏమి తిని బతకను ‘ అని ఇంద్రుడిని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగం మీద ఏర్పాటు చేసి, యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.

రామ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను, ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను ” అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది)