వాల్మీకి రామాయణం 169 వ భాగం, కిష్కిందకాండ

కబంధుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. ఆ పంపా నదిలో అరవిసిరిన పద్మాలు, పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలని చూసి రాముడు బాధపడ్డాడు. ఆయనకి వాటిని చూడగానే సీతమ్మ ముఖము, కన్నులు గుర్తుకొచ్చి భోరున విలపించాడు. అప్పుడాయన లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఈ ప్రాంతం ఎంత బాగుందో, ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కిందకి పడుతున్నాయి, ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటూ కదులుతూ ఉన్నాయి. అలా కిందకి పడుతున్న పువ్వులని, కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా! అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఇవన్నీ చూస్తుంటే, సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్నాను.  

ఎవరూ అడక్కుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. అలాగే ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్లా, లేకపోతె పుష్పాలని వర్షించే మేఘాల? అని నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉంది.

మత్త కోకిల సన్నాదైః నర్తయన్ ఇవ పాదపాన్ |
శైల కందర నిష్క్రాంతః ప్రగీత ఇవ చ అనిలః ||
ఇక్కడ గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది, అలాగే ఇక్కడ కోకిల పాట పాడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయువు పాట పాడుతున్నాడు, చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి, కోకిల చెట్టు మీద కూర్చొని పక్కవాయిద్యాలు కూస్తుంది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా? అనిపిస్తుంది. ఈ సమయంలో సీత నా పక్కన ఉంటె ఎంత బావుండేదో. సీత పక్కన లేకపోవడం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది.


లక్ష్మణా! అలా చూడు, ఆ కొండ మీద మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే, ఆడ నెమలి దాని చుట్టూ పరమ సంతోషంగా ఎలా తిరుగుతుందో చూడు. అవునులే, ఎందుకు ఆడవు. ఆ మగ నెమలి భార్య అయిన ఆడ నెమలిని, ఎవరూ ఎత్తుకుపోలేదు కదా? ఎన్ని ఆటలన్నా ఆడతాయి. నా మనస్సు సీత దెగ్గర ఉంటుంది, సీత మనస్సు నా దెగ్గర ఉంటుంది. అందుకని మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే, ఒకరి పక్కన ఒకరం ఉండాలి. అలా లేకపోవడం చేత ఇవ్వాళ నా మనస్సు ఆనందపడడం లేదు. ఇది చైత్ర మాసం కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధ పడుతున్నానంటే, సీత ఇంకెంత బాధ పడుతుందో లక్ష్మణా.

పూర్వం చైత్ర మాసంలో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని, ఇవ్వాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖంగా ఉంది. ఈ అరవిసిరిన తామర పువ్వులని దెగ్గరగా చూస్తుంటే, ఆ పువ్వులలోని గాలి నా ముఖానికి తగులుతుంటే ఎలా ఉందో తెలుసా లక్ష్మణా, సీత ముఖం నా ముఖానికి దెగ్గరగా ఉన్నప్పుడు, సీత ముక్కునుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఆ తుమ్మెదలు పువ్వుల మీద వాలి, అందులోని మకరందాన్ని తాగి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు, ఎంత అందంగా ఉంది ఆ సన్నివేశం. కాని నా మనసుకి ఎందుకనో ఆనందం కలగడం లేదు. ఇలాంటప్పుడు సీత నా పక్కన ఉండి, అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటె, ఆమె నోటి వెంట వచ్చే ఆ మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది.

సీతని చూడకుండా నేను ఉండలేను, నా శరీరం పడిపోతుంది, అందుకని నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకం చేసేసుకోమను ” అని రాముడు అన్నాడు.