వాల్మీకి రామాయణం 174 వ భాగం, కిష్కిందకాండ

ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేఇంద్రియాః |
ద్రష్టవ్యా వానరేఇంద్రేణ దిష్ట్యా దర్శనం ఆగతాః ||
అప్పుడు హనుమంతుడు ” జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా మిమ్మల్ని తీసుకెళతాను ” అని చెప్పి, రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.

అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో

అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||

” సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది ” అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు ” రామ! మీ దెగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామ! నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాశి పట్టుకుంటాడో, అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే, నా బాహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు ” అన్నాడు.

వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి, కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి, ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.

అప్పుడు రాముడు ” మనిద్దరమూ స్నేహం చేసుకున్నాము కదా, ఇకనుంచి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివీ ” అన్నాడు.