వాల్మీకి రామాయణం 175 వ భాగం, కిష్కిందకాండ

సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు  కూర్చున్న తరువాత సుగ్రీవుడు ” రామ! నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను ” అన్నాడు.

ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే |
వాలినం తం వధిష్యామి తవ భార్య అపహారిణం ||
అప్పుడు రాముడు ” ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి, ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని వాలిని చంపేస్తాను ” అన్నాడు.

ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నార! అన్నట్టుగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి.

తరువాత సుగ్రీవుడు ” కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకంలో కాని, స్వర్గలోకంలో కాని దాయని, నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను ” అన్నాడు.

సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు.

అప్పుడు సుగ్రీవుడు ” రామ శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి, అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను, అవి సీతమ్మ ఆభారణాలేమో చూడు ” అన్నాడు.

కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి, ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటె కళ్ళనిండా నీరు ఉండడం చేత, ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడంలేదు కనుక ఆయన లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! ఈ ఆభారణాలని ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడిఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు ” అన్నాడు.

న అహం జానామి కేయూరే న అహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్యా! ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు, ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. అన్నయ్యా! ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని, అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను ” అన్నాడు.