వాల్మీకి రామాయణం 178 వ భాగం, కిష్కిందకాండ

వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.  

తరువాత నేను రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ, మంత్రులు విషయాన్ని కనిపెట్టి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను.

ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక, నాకున్న బలం చేత, నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను, కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు.