వాల్మీకి రామాయణం 183 వ భాగం, కిష్కిందకాండ

రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం ||

సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. కాని సుగ్రీవుడు ” ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము ” అన్నాడు.

అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.

రాముడి శక్తి ఏమిటో చూశిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు ” రామ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దెగ్గరికి వెళదాము పద ” అన్నాడు.

“తప్పకుండా సుగ్రీవ, బయలుదేరదాము”, అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.