వాల్మీకి రామాయణం 188 వ భాగం, కిష్కిందకాండ

ఇద్దరూ హొరాహొరిగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. కాని వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడం వలన, మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది, వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళిమళ్ళి అన్ని వైపులా చూశాడు.

సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దము చేత మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి.

రాఘవేణ మహా బాణో వాలి వక్షసి పాతితః |

రాముడి బాణం యొక్క శబ్దం వినపడి, ఆ శబ్దం ఎక్కడినుంచి వచ్చిందో అని వాలి అటువైపుకి తిరిగెలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కిందపడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడితో ” రామ! నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమము ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. నా చర్మము ఒలిచి వేసుకోడానికి, మాంసము తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి, కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని.