వాల్మీకి రామాయణం 190 వ భాగం, కిష్కిందకాండ

ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||

అప్పుడు రాముడు ” నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దెగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము.  

నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే……..అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).

అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింప బడుతున్నవాడివి, సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే, నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కాని ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకుపూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, నాతో స్నేహం చేసి ఉంటె సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా, నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.