వాల్మీకి రామాయణం 197 వ భాగం, కిష్కిందకాండ

మార్గ అనుగః శైల వన అనుసారీ సంప్రస్థితో మేఘ రవం నిశమ్య |  
యుద్ధ అభికామః ప్రతినాద శంకీ మత్తో గజేంద్రః ప్రతిసంనివృత్తః ||
ఒక పెద్ద మదగజం ఆ వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉంది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ‘ ఆహా, ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తుంది, దాని మదం అణిచేస్తాను ‘ అనుకొని, తన తొండాన్ని పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక మళ్ళి ఆ మేఘం శబ్దం చేసింది. ‘ ఓహొ, మేఘమా ఉరుముతున్నది. మరొక మదగజం కాదన్నమాట ‘ అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి, తాను ముందు పడుకున్న చోటనే పడుకుంది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో తెలీదు, కాని ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టాయో, ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షాలు పడే కాలంలోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు.

నిద్రా శనైః కేశవం అభ్యుపైతి ద్రుతం నదీ సాగరం అభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనం అభ్యుపైతి కాంతా స కామా ప్రియం అభ్యుపైతి ||
నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది, నది వేగంగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది, ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి, పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోంది. ఈ వర్షాకాలం ఇంత గొప్పదయ్యా లక్ష్మణా. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు, అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది, అప్పుడు వర్షం కురవదు. అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు ” అని రాముడు అన్నాడు.