వాల్మీకి రామాయణం 198 వ భాగం, కిష్కిందకాండ

అలా వర్షాకాలం పూర్తయిపోయింది, కార్తీక మాసం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి ” సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి, తగినంత సైన్యం ఉండాలి, మిత్రులయందు పరాకుగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి, ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు రాముడి దెగ్గరికి వెళ్ళాలి, కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు, ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనం చెయ్యడం మంచిది.


నువ్వు వానరాలని దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే, ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు, నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు, అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ‘ నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు ‘ అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యదార్ధమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దెగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కాని నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే, ఇక ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదమే ” అన్నాడు.

హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి ” నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి, 15 రోజుల తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు ” అన్నాడు.