వాల్మీకి రామాయణం 201 వ భాగం, కిష్కిందకాండ

అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో ” నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ‘ రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ‘. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి, ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు ” అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడు, ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు.  


కాని అప్పటికే లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి ” ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు ” అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ” నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి, నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదే, వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది. స్నేహం చెయ్యడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయం చెయ్యకపోవడం నా తప్పే ” అన్నాడు.

సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో న అత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనం ||
అప్పుడు హనుమంతుడు అన్నాడు ” సుగ్రీవా! నీకు ఇంకా బోధపడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు, ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. కాని రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కాని నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. కాబట్టి ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని, నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతలివాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ‘ రాముడు నన్ను ఇంతమాట అంటాడ ‘ అని వినవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే, అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోమాకు ” అన్నాడు.