వాల్మీకి రామాయణం 202 వ భాగం, కిష్కిందకాండ

బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటిమీద ఉన్న ఆభరణాలు అటుఇటు తొలిగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు, సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటుఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు.


అప్పుడు సుగ్రీవుడు తారతో ” తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినదానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నవో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది, ఆమె ఒంటిమీద గుడ్డ సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు ). నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కాని, స్త్రీ జోలికి వెళ్ళడం కాని ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి, అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను ” అన్నాడు.

సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడుపడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటుఇటు తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది, పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి, ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది.