వాల్మీకి రామాయణం 214 వ భాగం, కిష్కిందకాండ

తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో ” హనుమా! నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీమీదే ఆశ పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి ” అన్నాడు.

ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడాయన హనుంతుడితో ” నాయనా! నువ్వు సీత దెగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాసం పొందుతుంది ” అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు.

అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని, రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిధ్దపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ ” బయలుదేరండి ” అని ఆదేశించాడు.

అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు ‘ ఒరేయ్! మీరందరూ ఎందుకురా నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను ‘ అని అంటున్నాడు. మరొకడు ‘ నేను భూమిని చీల్చేస్తానురా ‘ అని అంటున్నాడు. ఇంకొకడు ‘ నేను సముద్రాల్ని కలిపెస్తాను ‘ అని, మరొకడు ‘ నేను పర్వతాలని కుదిపెస్తాను ‘ అని అంటున్నాడు. ‘ నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను రా ‘ అని ఒకడు అంటున్నాడు. ‘ మీరందరూ విశ్రాంతి తీసుకొండిరా, ఆ పదితలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను ‘ అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ, తోకలకి ముద్దులు పెట్టుకుంటూ, పైకి కిందకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నాలు దిక్కులకి వెళ్ళిపోయారు.