వాల్మీకి రామాయణం 216 వ భాగం, కిష్కిందకాండ

దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు.  

వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రములనుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు.

అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడినుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు.

తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.  

అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి ” మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది ” అన్నారు.