వాల్మీకి రామాయణం 220 వ భాగం, కిష్కిందకాండ
Posted by adminAug 8
వాల్మీకి రామాయణం 220 వ భాగం, కిష్కిందకాండ
స చతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ |
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా ||
సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో ” నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో.
ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలనచెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము ” అన్నాడు.
అప్పుడు అంగదుడు ” ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి ” అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు.
అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.