వాల్మీకి రామాయణం 226 వ భాగం, కిష్కిందకాండ

అప్పుడు జాంబవంతుడు ” అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి ” అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి ” ఏమయ్యా హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి ‘ ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు ‘ అనింది. అప్పుడా వాయువు అన్నాడు ‘ అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించామన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు ‘ అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు.
  
నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని ” హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు ” అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.  

నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుగ్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుగ్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు ” అని జాంబవంతుడు అన్నాడు.