వాల్మీకి రామాయణం 230 వ భాగం, సుందరకాండ
Posted by adminAug 18
వాల్మీకి రామాయణం 230 వ భాగం, సుందరకాండ
హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి ” సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం ” అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి ” నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు ” అన్నాడు.
అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు ” ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు ” అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.
అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి ” అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ‘ పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ‘ అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో ” అన్నాడు.