వాల్మీకి రామాయణం 237 వ భాగం, సుందరకాండ
Posted by adminAug 25
వాల్మీకి రామాయణం 237 వ భాగం, సుందరకాండ
అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.
‘ ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను ‘ అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళి కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి ” ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి ” అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.