వాల్మీకి రామాయణం 240 వ భాగం, సుందరకాండ
Posted by adminAug 28
వాల్మీకి రామాయణం 240 వ భాగం, సుందరకాండ
అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.
రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైడుర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దెగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో(సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి, అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు, ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద, పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి, ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.