వాల్మీకి రామాయణం 246 వ భాగం, సుందరకాండ

హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి, స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది , ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది , కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు.

అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్తపడి, తన తొడలతో, చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్నదానిలా, శ్రద్ధ నశించిపోయినదానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దెగ్గరికి తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి, ఆకులని అడ్డు పెట్టుకొని రావణుడిని చూశాడు.