వాల్మీకి రామాయణం 247 వ భాగం, సుందరకాండ
Posted by adminSep 4
వాల్మీకి రామాయణం 247 వ భాగం, సుందరకాండ
రావణుడు సీతమ్మతో ” సీత! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగె చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి.
ఎందుకు ఇలా ఒంటిజెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పొడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే, నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు ” అన్నాడు.