వాల్మీకి రామాయణం 248 వ భాగం, సుందరకాండ

రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి ” రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటె ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. ‘ నేను సీతని తీసుకొచ్చాను ‘ అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక.

ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? ” అని ప్రశ్నించింది.