వాల్మీకి రామాయణం 250 వ భాగం, బాలకాండ

అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి ” సీత! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటె సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలె మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము, కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు ” అని గద్దించారు.

అప్పుడు సీతమ్మ అనింది ” ఐశ్వర్యం ఉంటె భర్తగా చూడడం, రాజ్యం ఉంటె భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటె భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు ” అనింది.