వాల్మీకి రామాయణం 253 వ భాగం, సుందరకాండ
Posted by adminSep 10
వాల్మీకి రామాయణం 253 వ భాగం, సుందరకాండ
ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు. ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణంలోని ఇళ్ళన్నిటినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా ‘ ఓ తల్లి!, ఓ అక్క!, ఓ తండ్రి!, ఓ చెల్లి! ‘ అనే కేకలు వినపడ్డాయి, లంకంతా బూడిదయిపోయింది.
నేను అటువంటి కలని చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదుగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది, కట్టుకున్న పట్టు పుట్టం తనంతట కొంచెం కిందకి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తోంది, పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్తు సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కాని ప్రస్ఫుటంగా శుభ శకునములు ఆవిడ శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటె, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటె, మీ మీదకి రామ బాణాలు పడకుండా ఉండాలంటె ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది ” అని త్రిజట చెప్పింది.
ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు.
అప్పుడు సీతమ్మ ” నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక, నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి ” అని, ఈ లంకని పాలిస్తున్న రావణుడికి, ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు అందుకనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని ‘ కాలమే మృగ స్వరూపంలో వచ్చి నన్ను మొహపెట్టింది, నేను అల్ప భాగ్యం ఉన్నదానిని అందుకనే ఆ మృగాన్ని చూసి మొహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటె అన్నీ ఉండేవి, రాముడిని వదిలేశాను అన్నీ పోయాయి. రాముడి తరవాత పుట్టిన వాడిని వదిలాను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు. రామా! రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభాపెట్టాలని చూశాడు, కాని నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను, భూమిమీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను, ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుందని అనుకున్నాను. కాని నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమయ్యింది. కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చే వాళ్ళు లేరు ‘ అనుకొని, తన కేశపాశములని(జుట్టుని) చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది.