వాల్మీకి రామాయణం 254 వ భాగం, సుందరకాండ

సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడింది. ఆ చాప అక్కడినుంచి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది, అప్పుడా తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది, కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది.   

అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు ‘ ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతె, రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని, నా మీదకి వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి యుద్ధం జెరుగుతుంది. జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కాని రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.

ఇప్పుడు నేను వానర బాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ బాష అర్ధం కాదు. మనుష్య బాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపంలో ఉన్న నేను మనుష్య బాషలో మాట్లాడితే, ఇది కచ్చితంగా రావణ మాయె అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఒదార్చాలి? ” అని అనుకుంటూ, ” సీతమ్మ ఉరి పోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెబుతాను ” అని అనుకొని హనుమంతుడు రామ కథ చెప్పడం ప్రారంభించాడు.