వాల్మీకి రామాయణం 255 వ భాగం, సుందరకాండ

“పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించివాడు, ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడం కోసమని, ఆయనని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయ జింకని ప్రవేసపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీదనుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను ” అని చెప్పి ఆగిపోయాడు.

ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా, దెగ్గర దెగ్గరగా వచ్చి, కాళ్ళతో కొమ్మని పట్టుకొని, చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై, పింగళ వర్ణంతో, పచ్చటి నేత్రాలతో, పగడాల మూతిలాంటి మూతితో రామ కథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దెగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.