వాల్మీకి రామాయణం 256 వ భాగం, సుందరకాండ
Posted by adminSep 13
వాల్మీకి రామాయణం 256 వ భాగం, సుందరకాండ
తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) ” లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి ” అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ‘ అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ‘ అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది ” ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక ” అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది.
అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి ” అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా ” అన్నాడు.
సీతమ్మ అనింది ” ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను ” అనింది.