వాల్మీకి రామాయణం 258 వ భాగం, సుందరకాండ

అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు, ఆ తరువాత సుగ్రీవుడి దెగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసినతరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ ” అన్నాడు.

అప్పుడు సీతమ్మ అనింది ” నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటె నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ బక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? ” అనింది.