వాల్మీకి రామాయణం 261 వ భాగం, సుందరకాండ
Posted by adminSep 18
వాల్మీకి రామాయణం 261 వ భాగం, సుందరకాండ
కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి ” ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోన, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావ. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా ” అనింది.
సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతొ, బలిసిన తొడలతొ, సన్నటి నడుముతొ, విశాలమైన వక్షస్థలంతొ, శంఖంలాంటి కంఠంతొ, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతొ, పరిఘలవంటి భుజములతొ నిలబడ్డాడు.
హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి ” నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుగ్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతె రాముడు నిన్ను నా దెగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతె రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జెరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళి రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దెగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి ” ఆనింది.