వాల్మీకి రామాయణం 268 వ భాగం, సుందరకాండ

అప్పుడా 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళి ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, అప్పుడాయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు.

అప్పుడాయన ” మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు ” అని చెప్పి మళ్ళి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.