వాల్మీకి రామాయణం 276 వ భాగం, సుందరకాండ
Posted by adminOct 3
వాల్మీకి రామాయణం 276 వ భాగం, సుందరకాండ
ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి ” ఈ వానరాన్ని చంపెయ్యండి ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు లేచి ” అన్నయ్య! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసెయ్యడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది. అందుకని వచ్చిన దూతని చంపద్దు ” అన్నాడు.
విభీషణుడి మాటలు విన్న రావణుడు ” వానరాలకి తమ తోక అంటె చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దెగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ‘ తోకలేని కోతి, తోకలేని కోతి ‘ అని ఏడిపిస్తారు ” అన్నాడు.
అప్పుడు వాళ్ళు పాట బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ‘ గూఢచారి, గూఢచారి ‘ అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.