వాల్మీకి రామాయణం 277 వ భాగం, సుందరకాండ

అప్పుడు హనుమంతుడు ‘ వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలొ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను ‘ అనుకున్నాడు. వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు.

అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు ” అన్నారు.

సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి ” నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక ” అనింది.

వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు ‘ అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ‘ అని అనుకుని, ‘ ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ‘ అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ ” హా తాత, హా పుత్ర, హా తల్లి ” అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.