వాల్మీకి రామాయణం 282 వ భాగం, యుద్ధకాండ

హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి ” హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.

సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దెగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దెగ్గర ఉన్నది ఈ దేహమే, అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను ” అని, హనుమని దెగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.