వాల్మీకి రామాయణం 286 వ భాగం, యుద్ధకాండ

తరువాత రాముడు సుగ్రీవుడితో ” వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి, ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి, తాగడానికి మంచి నీరు దొరకాలి, పళ్ళు, తేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి.

వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలొ శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి ” అని చెప్పాడు.