వాల్మీకి రామాయణం 287 వ భాగం, యుద్ధకాండ

అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు ” ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో ” అని ఒకడు, ” నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ ” అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గోడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.

అప్పుడు రాముడు ” మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి ” అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు, కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు, భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు.

చంద్రుని కాంతి కెరటాలు మీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశము, సముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి, ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది, కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది, అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు.