వాల్మీకి రామాయణం 295 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు ప్రహస్తుడు ” ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు, మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకూ తెలీదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు ” అన్నాడు.

విభీషణుడు ” ఇక్ష్వాకు వంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామ బాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటె నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటె, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చెయ్యండి, రావణుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని ఇచ్చెయ్యండి, అలా చేస్తే మీరు బతికుంటారు లేకపోతె నశించిపోతారు ” అన్నాడు.

ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి ” వీర్యంలొ కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రి!. పద్దాక ‘ రాముడు వచ్చేస్తాడు ‘ అని మాట్లాడుతున్నావు, ఎందుకంత భయం నీకు, ఏంచేస్తాడు రాముడు వస్తే ” అన్నాడు.

అప్పుడు విభీషణుడు ” నువ్వు బాలుడివి, నీకేమి తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకోచ్చినవాడిని, నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు. ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకురా ఇంద్రజిత్, కుర్చో ” అన్నాడు.