వాల్మీకి రామాయణం 296 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రావణుడు అన్నాడు ” ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండచ్చు. శత్రువు అని తెలిసి, ఆ శత్రువు ఉన్న చోట ఉండచ్చు. కాని మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్నవాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి, ఆ ఏనుగులు చెప్పిన మాటలని నీకు చెబుతాను జాగ్రత్తగా విను విభీషణ. ఆ ఏనుగులు అన్నాయి ‘ మనకి అగ్నివల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి మన జాతి వల్లే భయం ‘ అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తోంది. ఆవులే ఐశ్వర్యము, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయము కలుగుతాయి. నాకు నీవల్లే భయమొస్తోంది. ఇవ్వాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి ” అన్నాడు.

అప్పుడు విభీషణుడు ” నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక, నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితొ నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటె నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు, అందరూ సుఖంగా ఉండండి ” అని చెప్పి, రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనతోపాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ అయిదుగురు ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు.