ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దెగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దెగ్గరికి వెళ్ళి ” అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు ” అన్నాడు.

” నేను మాత్రం సీతని ఇవ్వను ” అని, సుకుడు అనేవాడిని పిలిచి ” నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. ‘ నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి ‘ అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు ” అని సుకుడిని పంపించాడు.

ఆ సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు ” దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు. రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు ” అన్నాడు.

ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ‘ రామ రామ ‘ అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింప చేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.

ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు ” రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది ” అన్నాడు.

వాల్మీకి రామాయణం 303 వ భాగం, యుద్ధకాండ