వాల్మీకి రామాయణం 304 వ భాగం, యుద్ధకాండ
Posted by adminOct 31
వాల్మీకి రామాయణం 304 వ భాగం, యుద్ధకాండ
చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో అలంకరింపబడ్డ బాహువు, అనేకమంది స్త్రీలచేత స్ప్రుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు ” పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతె నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు ” అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.
అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు.
ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి ” భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటె అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దెగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు, అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రయోగించు ” అన్నాడు.
అపడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. ఆ దెబ్బకి అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది. ” అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి, అక్కడ గో సంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది ” అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు.