వాల్మీకి రామాయణం 313 వ భాగం, యుద్ధకాండ

అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు ” సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావె, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఎమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జెరగరానిది జెరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు ” అన్నాడు.

తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దెగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో  ” నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యని కూడా అపహరించావు కనుక నీయందు దోషమున్నది కనుక, నిన్ను నేను సంహరించవచ్చు కనుక, ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా ” అని రాముడు అంగదుడితొ చెప్పాడు.