వాల్మీకి రామాయణం 316 వ భాగం, యుద్ధకాండ

అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.

తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు ” అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ‘ ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దెగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపసమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ‘ అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి ” మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను ” అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.