వాల్మీకి రామాయణం 317 వ భాగం, యుద్ధకాండ

అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.

రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి ” నాయనా సుగ్రీవ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మొహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి ” అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.