వాల్మీకి రామాయణం 318 వ భాగం, యుద్ధకాండ

కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి ” నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని ” అని బాధపడ్డాడు.

విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి ” ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వానర సైన్యం ఎందుకు పారిపోతుంది ” అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు ” మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము ” అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.

ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో ” తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి ” అన్నాడు.