వాల్మీకి రామాయణం 319 వ భాగం, యుద్ధకాండ

ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులని పిలిచి ” యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి  ” అని ఆజ్ఞాపించాడు.

తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి ” మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దెగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. ‘ ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంక రాముడి మీద ఎందుకు ఆశ ‘ అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి ” అన్నాడు.